భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురును వినియోగించే దేశం, అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునే దేశం. మనకు కావలసిన ముడి చమురులో 80 శాతం మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. అటువంటి దేశంగా, 2014 తరువాత అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల వలన భారత్ గణనీయంగా లబ్ది పొందింది. ద్రవ్య లోటు, వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఊతమిచ్చింది. చమురు పై, వంట గ్యాస్ పై ప్రభుత్వం అందించే సబ్సిడీని తగ్గించుకొని ఆ నిధులను ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోవడానికి వెసలుబాటు కలిగించింది. అయితే, ఇటీవల కాలంలో శెరవేగంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత్ పై ఆర్ధిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సినంత విపత్కర పరిస్థితులు లేకపోయినప్పటికీ రాబోయే ఒత్తిడిని తట్టుకునే వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.

2014 లో మోడీ అధికారం చేపట్టే నాటికి బ్యారెల్ ధర 105 డాలర్లు పలికింది. తదనంతరం, ఐరోపా దేశాలలో ఆర్ధిక మాంద్యం ఏర్పడడం, చైనాలో భారీగా వస్తు ఉత్పత్తులు తగ్గడం చమురు ధరల పతనానికి దారి తీశాయి. వీటికి తోడుగా, చమురు ఉత్పత్తి దేశాలకు పోటీగా అమెరికా నూతన సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని ఉపయోగించి, భారీగా పెట్టుబడులు పెట్టి షేల్ చమురు ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఇది ముడి చమురు ఎగుమతుల పై ఆధారపడిన చమురు ఉత్పత్తి దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. తమ ఉనికికే ప్రమాదకరంగా మారిన ఈ అమెరికా షేల్ చమురు పోటీతత్వాన్ని తట్టుకొని నిలబడడం కోసం చమురు ఎగుమతి దేశాలు అవసరానికి మించి ముడి చమురును ఉత్పత్తి చేసి భారీగా నిల్వలు పెంచడం ప్రారంభించాయి. ఫలితంగా, చమురు ధర సగటున 45 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గిన ధర వలన కలిగిన లాభాల్ని కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు వినియోగదార్లకు అందించింది.  తగ్గిన అంతర్జాతీయ ధరలను ఆసరాగా చేసుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అబ్రివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం పన్నులను పెంచి ఆదాయాల్ని  సమకూర్చుకునే ప్రయత్నం చేశాయి. 2013-14 లో పెట్రోల్ డీజిల్ నుండి వచ్చిన ఆదాయం జీడీపీ లో 0.44 శాతం కాగా పన్నుల పెంపు వల్ల అది 2016-17 లో 1.44 శాతంకు పెరిగింది. కేంద్రం వేసిన పన్నుల్లో 42 శాతం నిధులను రాష్ట్రాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందిస్తుండగా, మిగితా 58 శాతంలో కొంత భాగం నష్టాల్లో ఉన్న చమురు కంపెనీలను ఆదుకోవడానికి ఉపయోగించింది. యూపీఏ హయాంలో పేరుకుపోయిన 43,400 కోట్ల రూపాయల పాత బకాయిలను సైతం ఇరాన్ కు మోడీ ప్రభుత్వం చెల్లించింది. మరికొంత భాగం జాతీయ రహదారులు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి పథకాలకు నిధులను సమకూర్చడానికి ఉపయోగిస్తున్నారు.

2017-11-17 (6)

అయితే దాదాపు మూడేళ్ళ పాటు సగటున 45 డాలర్లుగా ఉన్న చమురు ధర ఈ ఏడాది సెప్టెంబర్ నుండి క్రమంగా పెరుగుతూ నవంబర్ 14వ తేదీ నాటికి 63.25 డాలర్లుగా నమోదయింది. ఇలా అకస్మాత్తుగా ధరలకు రెక్కలు రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. చమురు ఎగుమతి చేసే దేశాలు అన్నీ కలిసి చమురు ఉత్పత్తిని నిలిపేయాలని తీసుకున్న నిర్ణయానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండడం, దాని వలన ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పడిపోవడం, మార్చి 2018 వరకు చమురు ఉత్పత్తిని నిలిపేయాలని చమురు ఉత్పత్తి దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని మార్చి 2018 తరువాత కూడా కొనసాగించాలని నిర్ణయించడం, ఆర్ధిక మాంద్యం కోరల్లో చిక్కుకున్న ఐరోపా దేశాలు తిరిగి పుంజుకోవడం, చైనాలో వస్తు ఉత్పత్తులు ఊపందుకోవడం వంటి కారణాల చేత చమురు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. వీటికి తోడుగా సౌదీ రాజ కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా ఏర్పడిన రాజకీయ అస్థిరత ప్రభావం కూడా చమురు ధరల పైన పడింది. క్రమంగా ఆసియా లో చమురు ఉత్పత్తి పడిపోతుంది. గత కొన్ని దశాబ్దాలుగా కొత్త చమురు నిల్వలను అన్వేషించడం సవాలుగా మారింది. భారీగా పెట్టుబడులు పెట్టి పాత చమురు బావుల నుండే చమురును వెలికి తెస్తున్నాయి తప్ప కొత్త బావులను అన్వేషించడం లేదు. చమురు ఉత్పత్తిలో రారాజు అయిన సౌదీ మెరుగైన చమురు ధరల కోసం ఉత్పత్తిని నిలిపేసి అంతర్జాతీయంగా తన మార్కెట్ వాటాలను సైతం రష్యాకు, అమెరికా కు కోల్పయింది. ఫలితంగా, సౌదీ ద్రవ్య లోటు 17.2 శాతానికి ఎగబాకింది. చమురు ఉత్పత్తిని ఆపేయాలన్న నిర్ణయంతో అనేక చమురు ఎగుమతి దేశాల ఆర్ధిక వ్యవస్థలు సమతమవుతున్నాయి. వెనిజులా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసింది. అయినప్పటికీ ఉత్పత్తిని నిలిపేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం వలన గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కనిష్ట స్థాయికి నిల్వలు పడిపోయాయి. ఫలితంగా చమురు ధరలు పుంజుకున్నాయి. సౌదీ ద్రవ్య లోటు కాస్త మరుగయి 9.3 శాతంగా నమోదయింది. తాజా పరిస్థితులను తమకు మరింత అనుకూలంగా మార్చుకొని, ఆశాజనకమైన ధరలు లభించేలా చమురు ఎగుమతి దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పరిణామం భారత ఆర్ధిక వ్యవస్థకు ఒక సవాలుగా మారనుంది. సంస్కరణల రథ సారథి అయిన ప్రధాని మోడీకి కూడా ఇది ఒక పరీక్షగా పరిణమించనుంది. ఏడాదికి 157.5 కోట్ల బ్యారెల్ ల చమురును భారత్  దిగుమతి చేసుకుంటున్నది. ముడి చమురు ధర బ్యారెల్ పై ఒక డాలర్ పెరిగితే ప్రభుత్వ ఖజానా పై ఏడాదికి రూ 10 వేల కోట్ల భారం పడుతుంది. అలాంటిది, బ్యారెల్ కు 45 డాలర్లు ఉన్న ధర అకస్మాత్తుగా బ్యారెల్ కు 70 డాలర్ల దిశగా దూసుకెళ్లడం వలన దేశ ఆర్ధిక స్థితిగతుల పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇటీవల పెట్రోల్ డీజల్ ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం లీటరుకు 2 రూపాయల మేరకు ఎక్సైజ్ పన్నును తగ్గించుకుంది. దాని తరువాత గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ను తగ్గించాయి. ముడి చమురు ధరలు పెరుగుతున్నా కొద్దీ ప్రజలకు స్వాంతన కల్పించాలనే లక్ష్యంతో పన్నులు తగ్గించాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఖజానా పై విపరీతమైన భారం పడుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కొత్త పథకాలను అమలు చేసే వెసలుబాటు కోల్పోతాం. పెట్రోల్, డజల్ పై తగ్గే ప్రతీ రూపాయి పన్ను కారణంగా జీడీపీ లో 0.7 శాతం మేరకు రాబడిని కోల్పోతుంది. గత మూడేళ్ళుగా ప్రభుత్వం ఎంతో శ్రమించి, కఠినమైన ఆర్ధిక క్రమశిక్షణను పాటించి యూపీఏ హయాంలో అదుపు తప్పిన ద్రవ్య లోటును కట్టడి చేసింది. 4.4 శాతం ఉన్న ద్రవ్య లోటును 3.5 శాతానికి తగ్గించగలిగారు. దీనికి తోడుగా ప్రమాదకర స్థాయికి చేరిన వాణిజ్య లోటును సైతం అదుపు చేయగలిగాము. 4.3 శాతంగా ఉన్న వాణిజ్య లోటును 1 శాతానికి కుదించగలిగారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో పాటు, పడిపోయిన చమురు ధరలు దీనికి తోడ్పాటును అందించాయి.

2017-11-17 (7)

చమురు ధరలు పెరిగినా కొద్దీ ద్రవ్య లోటు, వాణిజ్య లోటు అదుపు తప్పుతాయి. బ్యారెల్ పై ప్రతీ 10 డాల్లర్ల పెరుగుదల జీడీపీ లో 0.4 శాతం కరెంటు అకౌంట్ బాలన్స్ తగ్గుదలకు కారణమవుతుంది. ఎంతో శ్రమించి సాధించిన ఆర్ధిక క్రమశిక్షణకు గండి పడుతుంది. గత మూడేళ్ళలో సాధించిన మెరుగైన ఆర్ధిక ప్రమాణాల వలన వివిధ దేశాల కరెన్సీ లకు పోటీని ఇచ్చి ఒక బలమైన కరెన్సీ గా రూపాయి అవతరించింది. అయితే, వాణిజ్య లోటు పెరిగినప్పుడు మన రూపాయి విలువ క్షీణించే అవకాశం ఉంటుంది. రూపాయి విలువ క్షీణించినప్పుడు దిగుమతులు మరింత ప్రియాయమవుతాయి. యూపీఏ హయాంలో విదేశీ మారక నిల్వలు 300 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మోడీ ప్రభుత్వం గత మూడేళ్ళలో విదేశీ మారక నిల్వలను 400 బిలియన్ డాలర్లకు పెంచింది. ఒకవేళ చమురు ధరల వలన వాణిజ్య లోటు అదుపు తప్పితే ఈ నిల్వలు కొంత మేరకు పతనమవక తప్పకపోవచ్చు.

చమురు ధరలు పెరగడమంటే ద్రవ్యోల్బణాన్ని దిగుమతి చేసుకోవడమే.  ఎందుకంటే రవాణాకు మూలమైన పెట్రోల్, డీజల్ ధర పెరగడం వలన అన్ని వస్తు సేవల ధరలు పెరుగుతాయి. చమురు పై పెరిగే ప్రతీ 10 డాలర్ల ధర పెరుగుదల 0.7 శాతం ద్రవ్యోల్బణానికి కారణం అవుతుంది. ద్రవ్యోల్భణం కారణంగా వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆర్ బి ఐ ముందుకు రాకపోవచ్చు. అవసరమైతే ద్రవ్యోల్భణం కట్టడి చేయడం కోసం వడ్డీ రేట్లను పెంచడానికి సైతం ఆర్ బి ఐ వెనకాడకపోవచ్చు. వడ్డీ రేట్ల తగ్గుదల కోసం ఎదురు చూస్తున్న పెట్టుబడీదార్లకు ఈ పరిణామాలు నిరాశను మిగిలించవచ్చు. వాస్తవానికి, ఆశించిన స్థాయిలో జీడీపీ నమోదుకాకపోవడం, నిరాశాజనకమైన కార్పొరేట్ సంస్థల లాభాలు, ఖరీదైన వాటాల మదింపుల వలన ఈ ఏడాది ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో విదేశీ మదుపర్లు భారత్ మార్కెట్ ను వీడారు. అయితే అక్టోబర్ లో ప్రభుత్వం బ్యాంకులకు ప్రకటించిన పెట్టుబడుల కారణంగా తిరిగి వారు భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. వడ్డీ రేట్ల పై ఆశించిన చర్యలు లేకపోతే వారి పెట్టుబడుల పై పునరాలోచన చేయవచ్చు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా వృద్ధి బలంగా ఉంది. ఇటువంటి ఈ సమయంలో ద్రవ్యోల్భణం పెరిగి రూపాయి క్షీణించినా, వడ్డీ రేట్లు పెరిగినా విదేశీ మదుపర్లు భారత్ ను వీడే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగడం వలన ఖర్చులు పెరిగి ప్రజలు తమ వస్తు వినయోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఫలితంగా కార్పొరేట్ కంపెనీల లాభాలకు కోత పడుతుంది. ముఖ్యంగా రిఫైనింగ్, విమానయానం, సిమెంట్, పాదరక్షకులు, టైర్లు, రసాయనాలు, నిర్మాణ సామాగ్రి తదితర రంగాల పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. 30 వేల మైలురాయిని సైతం దాటి వేగంగా దూసుకెళ్తున్న సెన్సెక్స్ వేగానికి బ్రేకులు పడే అవకాశం ఉంది. అంతిమంగా వీటన్నింటి ప్రభావం జీడీపీ మీద పడుతుంది.

గత ఏడాది ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వలన తాత్కాలికంగా జీడీపీ వృద్ధి రేటు కొంతమేరకు తగ్గింది. తగ్గిన జీడీపీని గట్టెక్కించేందుకు బ్యాంకులను పట్టి పీడిస్తున్న నిరర్ధక ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకుల్లో 2.11 లక్షల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు పెట్టనున్నామని, 7 లక్షల కోట్ల పెట్టుబడితో 83 వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లను నిర్మాణం చేయనున్నామని ఇటీవల ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలు ఎంతో ఆశాజనకంగా నిలిచాయి. వ్యాపార, వర్తక వర్గాల తో పాటు సామాన్య ప్రజలకు సైతం మన ఆర్ధిక వ్యవస్థ పై విశ్వసాన్ని పెంపొందించే రీతిలో ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయాలు ఉపయోగపడ్డాయి. ఈ ప్రకటనలకు తోడుగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా జీ.ఎస్.టి  పన్నుల విధానంలో ఎప్పటికప్పుడు చేస్తున్న మార్పులు ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా, కంపోసిట్ పన్ను చెల్లింపుదారుల లావాదేవీల పరిమితిని రూ 2 కోట్లకు పెంచడం, 28 శాతం పన్ను స్లాబులో కేవలం 50 వస్తుసేవలు మినహా మిగితావన్నింటినీ తక్కువ పన్ను ఉన్న స్లాబుల్లోకి మార్చడం, హోటళ్ల పైన 18 శాతంగా ఉన్న జిఎస్టి ని 5 శాతానికి తగ్గించడం వంటి నిర్ణయాలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో తిరిగి జిడిపి పుంజుకుంటుందనే అంచనాలు ఊపందుకున్నాయి. అయితే, చమురు ధరల రూపంలో భారత్ ఆర్ధిక వ్యవస్థకు మరొక సవాలు ఎదురుకానుంది.

దూసుకెళ్తున్న చమురు ధరల సమస్య కఠినమైనదే అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్ ఆర్ధిక మూలాలు బలంగా ఉన్నాయి, భారత్ భవిష్యత్తు అత్యంత ఆశాజనకంగా ఉంది అని ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్ధిక సంస్థ తదితర సంస్థలు చెబుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల పన్ను పరిధి పెరగడం, బ్యాంకుల్లో డిపాజిట్ లు పెరగడం, నల్లధనం సృష్టికి అడ్డుకట్ట వేయడం, ఒక స్వచ్ఛమైన, పారదర్శకమైన ఆర్ధిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడం దీర్ఘకాలికంగా భారత్ ను మరింత ధృడంగా చేయనుంది. ఎంతో సాహసోపేతంగా అమలు చేస్తున్న జీఎస్టీ మొదట్లో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం నిరంతరం దానిన అమలు తీరును పర్యవేక్షిస్తూ  ఎప్పటికప్పుడు చేసిన మార్పుచేర్పుల కారణంగా జీఎస్టీ అనుకూలమైన ఫలితాలను సాధిస్తోంది. ఒకే దేశం ఒకే పన్ను వ్యవస్థతో వ్యాపార సౌలభ్యాన్ని పెంచడం, పన్ను పరిధిని పెంచడం, పన్ను ఆదాయం పెంచడం, పన్ను రేట్లు తగ్గుముఖం పట్టేట్టుగా చూడడం వంటి అంశాల్లో జీఎస్టీ విజయవంతం అవడం కూడా మన ఆర్ధిక వ్యవస్థకు శుభ పరిణామం. ఇది కాకుండా, వ్యాపార సౌలభ్యం పెంచడం కోసం అనేక మోడీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలను అమలు చేసింది. జనధన్, ఆధార్, మొబైల్ త్రయాన్ని ఉపయోగించి వంట గ్యాస్ సబ్సిడీ, కిరోసిన్ సబ్సిడీ, ఇతర సబ్సిడీల వితరణలో, పెన్షన్లను, వివిధ రకాల ఉపకార వేతనాలను, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను నగదు బదిలీ పథకం ద్వారా అందించే సంస్కరణను విజయవంతంగా అమలు చేసింది. ఇలా మోడీ ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు తక్షణ ఫలితాలను అందిస్తూనే దీర్ఘకాలికంగా మన ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయనున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా భారత్ ఒక బలమైన నాయకత్వం కలిగి ఉంది. వీటన్నింటి దృష్ట్యా భారత్ ఈ చమురు ధరల సమస్యను ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉంది.

అయితే, చమురు విషయంలో అధికంగా దిగుమతుల మీదనే ఆధారపడ్డాం కాబట్టి దిగుమతుల కోసం ఒకే దేశం మీద ఆధారపడకుండా వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకోవడం వలన కొంత మేరకు నష్టనివారణ చేయవచ్చు. ఇప్పటికే ఈ దిశగా భారత్ కొంత మేరకు విజయవంతమైందని భావించవచ్చు. 2017 జనవరి నుండి జులై వరకు చమురు దిగుమతుల గణాంకాలు చూసినట్లయితే చమురు ఎగుమతి దేశాల నుండి దిగుమతి చేసుకున్న చమురు విలువ 42 శాతం పెరిగితే, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నది 65 శాతం పెరిగింది. ఈ దృష్ట్యా అమెరికా చమురు దిగుమతులు ఒక కీలక అంశం. మనం ప్రస్తుతం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నది చాలా తక్కువ మొత్తమే అయినప్పటికీ అమెరికా షేల్ చమురు, చమురు ఎగుమతి దేశాల సంప్రదాయ ముడి చమురుకు ఒక ప్రత్యామ్నాయం. చమురు ఉత్పత్తిలో అత్యంత వేగంగా దోసుకెళ్తున్న దేశం అమెరికా. ఈ నేపథ్యంలో అమెరికా తో సంబంధాలు విస్తృతపరుచుకోవడం ద్వారా చమురు ఎగుమతి దేశాలతో వ్యూహాత్మక బేరానికి సిద్ధం కావాలి.

రోజువారీ అవసరాలకు పూర్తిగా చమురు పై  ఆధారపడకుండా ఉండడానికి అధిక ఉత్పాదకశక్తి కలిగిన చమురు రహిత ప్రత్యామ్నాయాల వైవు భారత్ దృష్టిని సారించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు దీని పై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం లేదు. కానీ, చమురు రహిత  ప్రత్యామ్నాయాలు రాబోయే తరానికి అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పటికే నగరాలు కాలుష్యమయమై పోయాయి. ఢిల్లీ వంటి నగరాలను పొగ మంచు ముంచెత్తుతుంది. నివాసానికి అనుకూలంగా లేకూండా నగరాలు తయారయ్యాయి. అందుకే పునరుత్పాదక శక్తులు, ఇతర ప్రత్యామ్నాయాల అన్వేషణ కోసం భారత్ తగినంతగా పెట్టుబడులు పెట్టాలి. విద్యుచ్ఛక్తి ఆధారంగా నడిపే ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి.

గత మూడేళ్ళుగా ప్రభుత్వ ఆదాయం పెరగడం వలన  ప్రభుత్వ పెట్టుబడులతో వృద్ధిని వేగవంతం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయితే, మారుతున్న పరిస్థితుల్లో చమురు ధరల వల్ల తప్పకుండా ప్రభుత్వ ఖజానా పై కొంత భారం పడనుంది. కాబట్టి అనుకున్న వృద్ధి లక్ష్యాలను సాధించడానికి పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేట్ రంగాన్ని, చిన్న మధ్య తరహా పరిశ్రమలను సిద్ధం చేయాలి. ఎన్నో కఠినమైన నిర్ణయాల కారణంగా ద్రవ్య లోటును కట్టడి చేయగలిగాము. కాబట్టి, అంతటి కఠోర శ్రమ తో సాధించిన ఈ ఘనతను పెట్రోల్ డీజల్ పై విధించే పన్నును తగ్గించకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ద్రవ్య లోటు లక్ష్యానికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

– ఏనుగుల రాకేశ్ రెడ్డి, M.S(Finance), M.M.S, BITS Pilani
  డైరెక్టర్, సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ గవర్నెన్స్,

Advertisements